Friday, July 16, 2010

బ్లాగ్లోకం

ఒక మాలోకం
చాలా రోజులుగా బ్లాగులు చదివే అవకాశం రాలేదు. చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు అవకాశం రాగానే, మెలుకువగా వున్నంతసేపూ అన్ని బ్లాగులూ చదివెయ్యాలనిపిస్తోంది.
నిజం గా బ్లాగు లోకం వండర్ ఫుల్.
ఇక నా అభిమాన హాస్య నటుడు "AVS" గారు బ్లాగు లోకం లోకి ప్రవేసించడం శుభ పరిణామం. హాస్య బ్రహ్మలూ వగైరా ఇప్పటికే వున్నందు వల్ల ఈయన్ని హాస్య నారద అనచ్చేమో!
మొట్టమొదటే, హాట్ కేకు లాంటి టపా రాసేశారు. సీడీలు చూసేవాళ్ళందరూ వెంటనే మానెయ్యాలని 'ధాఋణం' గా శపించేశారేమిటండీ బాబూ! (సినీ పరిశ్రమ లోని అందరి గురించీ రాస్తే, ఏ సంపాదనా లేని నాలాంటివాళ్ళమాటేమిటండీ బాబూ! మేము సినిమాలు యెలా చూడాలి?)
కామెంట్లు చదువుతుంటే, సరదాగా వుంది. విమర్శల్ని సమర్థించేవాళ్ళు కొంతమంది, ఎదురుదాడి చేసేవాళ్ళు కొంతమంది, పాత టపాలకి లింకులు ఇచ్చేవాళ్ళు కొంతమంది, అనవసరం గా ఆవేశపడిపోయేవాళ్ళు కొంతమంది, కీ బోర్డు చేతిలో వుంది కదా అని వెర్రి వాగుడు వాగేవాళ్ళు కొంతమంది!
AVS గారి 'రెస్పాన్సిబుల్ రెస్పాన్స్' కూడా బాగుంది. దాని మీద కామెంట్లు ఇంకా బాగుంటున్నాయి.
కృష్ణశ్రీ అయితే ఓ టపానే రాసేశారు. 'గౌరవం వుంది' అంటూనే, ఏకేశారు. యెందుకండీబాబూ అంత సీరియస్ కామెంట్లు.
కాని నాకొకటి నచ్చింది. 'ముందు తెలుగు బాగా వ్రాయడం చదవడం నేర్చుకొని' అని ఆయన ఇచ్చిన సలహా.
ఈ మధ్య టీవీల్లో కూడా పైరసీ వల్ల సినీ పరిశ్రమకి వస్తున్న నష్టాలు గురించి బాగానే చూపిస్తున్నారు.
అలాగ అని సీడీ లు అద్దెకిచ్చి/అమ్ముకొని పొట్ట పోషించుకునే వాళ్లని 'చావ బాదడం' అగ్ర నటుల, వాళ్ళ అభిమానుల హీరోయిజం అనిపించుకుంటుందా?
అసలు పైరసీ అనేదానికి మూలం ఎక్కడ ఉందో ఆలోచించండి. 30 రూపాయలకి 3 సినిమాలు వాళ్లిస్తున్నారు కదా, మీరు కనీసం పాతికకో, ఇరవై కో ఇస్తే, దీన్ని నివారించవచ్చు కదా?
నా చిన్న బుర్రకి తట్టిన ఆలోచన ఇది.
AVS గారు బోళ్లు టపాలు రాయాలనీ, అందరినీ అలరించాలి అనీ కోరుకొంటా.

Thursday, March 18, 2010

కధలు

హాస్య కధలు
నేను పుట్టక క్రితం యెప్పుడొ డెభ్భై నాలుగో, డెభ్భై అయిదో సంవత్సరం లో పబ్లిష్ అయిన ఓ లావుపాటి పుస్తకం లోని ఓ కధ (అది కధో మరేమిటో బాగా గ్యాపకం లేదు) చదివాను.
నేనింకా స్కూల్లో చేరక ముందు మా నాన్నకి వుద్యోగం లో సస్పెండు చేశారు—యెందుకో. అమ్మకి వుద్యోగం వున్నా, నన్ను మా అమ్మమ్మగారింటికి పంపించారు. అక్కడే ఓ కాన్వెంట్ లో చేర్పించారు నన్ను. దాంతో మా చిన్న మామయ్య దగ్గర నాకు బాగా చనువు.
ఇప్పటికీ అటేపు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూంటాను.
ఆయన దగ్గర ఓ పెద్ద లైబ్రరీ లా బోళ్ళు పుస్తకాలు. అందులో పాత పత్రికలూ, సావనీర్లూ, సినిమా పాటల పుస్తకాలు, వెండితెర నవలలు ఇలా చాలా రకాలుండేవి.
అది ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక అనుకుంట. వ్రాసిన వారు మాత్రం యెర్రంసెట్టి శాయి. కధ పేరుకూడా గ్యాపకం లేదు. కధా గుర్తు లేదు. గుర్తున్నదల్లా ఒక్కటే.
ఆ గుర్తున్నదేమిటంటే.......
కధ ఆఖర్లో వాళ్ళ ఫ్రెండ్ సంతోషం పట్టలేక ఓ మాటంటాడు.
అది కూడా సరిగ్గా గ్యాపకం లేదు గాని, ఇలా వుంటుంది.
"జుహృద్జాక్లబ్యమ్మాక్కట్చత్తోయ్!"
ఇప్పటికీ అది తలుచుకుంటే భలే నవ్వు నాకు.
ఈ సారెప్పుడైనా మళ్ళీ ఆ పుస్తకం చూస్తే, ఆ మాట వెతికి పట్టుకుని రాస్తాను లెండి.

Friday, February 5, 2010

కూకటి వేళ్ళు

మ్లేఛ్ఛులు
కొన్ని పాత తెలుగు పుస్తకాలలో, నాటకాలలో, 'మ్లేఛ్ఛులు ' అనేమాటని చదివి, సందర్భానికి తగ్గట్టుగా 'సాయిబ్బులు ' అని అర్థం చేసుకొనేవాణ్ణి.
దానికి తగ్గట్టు వాళ్ళు కైమాలు కొట్టడం, గెడ్డాలూ మీసాలూ, గళ్ళ లుంగీలూ అవీ చూసి, 'ఈ ప్రపంచం లో వీళ్ళంత కౄరులు యెవరూ వుండరు ' అనుకొనేవాణ్ణి.
దానికి తగ్గట్టు, నా సాయిబ్బు క్లాస్ మేట్స్ కూడా నాకన్నా వయసులోనూ, పెర్సనాలిటీ లోనూ పెద్దగా వుండడం, నన్ను తరుచూ యేడిపించడం, శారీరకం గా నెప్పి కలిగించడం తో, నా అభిప్రాయం చాలా బలపడేది!
తరవాత, మ్లేఛ్ఛులు అంటే సాయిబ్బులే కాదు, మిగిలిన 'ఫారినర్స్ ' కూడా అని తెలుసుకున్నాను—ఇంగ్లీషు వాళ్ళని కూడా మ్లేఛ్ఛులు అని వ్యవహరించడం తో!
నిజానికి, ఈ తెల్లతోలువాళ్ళు అందరికన్నా కౄరులూ, నిర్దయులూ, మనం ద్వేషించదగ్గవారూ అన్న విషయాన్ని 'రూట్స్ ' చదివాక అర్థం అయ్యింది.
తెల్లతోలు ఇంగ్లీషువాళ్ళు, అనేక దేశాలని ఆక్రమించుకొని, కాలనీలు యేర్పాటు చేసుకోడమే కాకుండా, కొలంబస్ 'ఎల్ సాల్వడార్ ' కనుక్కొని, దాన్నే 'అమెరికా' అనుకోడం, తరవాత 'అమెరిగో వెస్పుకే' అనేవాడు అసలు అమెరికాని కనుక్కోవడం, మొదటి బ్యాచ్ ఇంగ్లీష్ సెట్లర్స్ ఓ పెద్ద వోడలో ప్రయాణించి, అమెరకా చేరడం, వందల వేల యెకరాలు ఆక్రమించుకోవడం—ఇది చరిత్ర!
ఈ అమెరికా తెల్లతోళ్ళు, 'క్రూసేడ్' ల పేరుతో, దండ్లు వెడలి, స్థానిక 'రెడ్ ఇండియన్లని ' వూచకోత కోసి, వాళ్ళ నేలల్ని ఆక్రమించుకోడమే కాకుండా, బ్రతికున్నవాళ్ళని బానిసల్ని చేసుకొన్నారు—ఇది కూడా చరిత్రే!
వాళ్ళ పొలాల్లోనూ, ఇళ్ళలోనూ పనిచెయ్యడానికి మనుషులు అవసరం కాబట్టి, పెద్ద పెద్ద వోడల్లో ఆఫ్రికా ఖండానికి వెళ్ళి, అక్కడినించి వేలాది మందిని బానిసలుగా పట్టుకొని, తరలించి, అమెరికా లో పనులు చేయించుకోడం అనేది—యెంత అమానుషం!
అలాంటి బానిసే--'కింటా కుంటే'!
ఆయన అనుభవాలూ, జీవితం—ఇవే 'రూట్స్' లో వర్ణితాలు—ఇవే అమెరికా బానిసల చరిత్రకి దర్పణాలు!
నాకైతే, తెల్లతోలు కనిపిస్తే, 'వలిచెయ్యండ్రా!' అని అరవాలనిపిస్తుంది—సినిమాల్లో చూసినా!
ఇదో మేనియా అంటారేమో అని భయం—అందుకే 'నార్మల్ ' గానే కనిపిస్తాను!
అవకాశం వస్తే మాత్రం, కొత్త బ్లేడు తో, నెప్పి తెలియకుండా తోళ్ళు వలిచేస్తాను!
(ళొ ళొ ళో! ఉత్తుత్తినే అండోయ్!)

Friday, January 1, 2010

HAPPY NEW YEAR

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
అయ్యబాబోయ్!
బ్లాగు రాయడం అంటే ఇంత కష్టమా! అని ఇప్పుడు తెలిసింది. నా రెండో టపాని రాయడానికి పదిహేను రోజులనించీ ప్రయత్నం.
ఇదిగో....ఇంతటితో సరిపెడుతున్నా.
త్వరలో నా మూడో టపా రాద్దామని కోశిష్ జేస్త.

Thursday, December 17, 2009

బ్లాగు సరదా

కూడలి లో తెలుగు బ్లాగులు చదువుతున్నప్పుడు, ప్రతీవాడూ/దీ చేస్తున్న పని--నేను చెయ్యలేనా? అనిపించడం తో, నేనూ మొదలెట్టాను. నేర్చుకోవలసింది చాలా వుందని తెలుసు--అందుకే ఈ ప్రయత్నం!